ఫొటోలు, వ్యక్తిగత వివరాలు..
● వారి రక్షణ కోసం
పోలీస్ శాఖ నిరంతరం కృషి
● వేధింపులపై బాధితులు
నిర్భయంగా ఫిర్యాదు చేయండి
● ‘సాక్షి’తో ఏఎస్పీ వెంకటేశ్వర్లు
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళల భద్రతే ధ్యేయమని, ఇందుకోసం పోలీసు శాఖ నిరంతరం కృషిచేస్తుందని, మహిళలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. తమకు ఎదురైన వేధింపులపై బాధితులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో షీటీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతోపాటు భరోసా కేంద్రం సిబ్బంది పనిచేస్తున్నారని, మహిళలకు అపరిచితుల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా గుర్తించాలనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు.
ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు..
జిల్లాలోని 22 పోలీస్‌స్టేషన్లకు వస్తున్న బాధిత మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు నిరంతరం కృషి చేస్తున్నాయని ఏఎస్పీ వెల్లడించారు. బాధిత మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు కేసులు నమోదు చేయడం, నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
డయల్ 100కు ఫిర్యాదు..
మహిళలపై వేధింపులు జరిగితే బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా పోలీస్‌స్టేషన్లకు వచ్చేందుకు ఇబ్బందిపడితే డయల్ 100, జిల్లా షీటీం సెల్ నం.87126 57676కు సైతం సమాచారం అందించవచ్చు.
భరోసా కేంద్రం, షీటీంలు..
మహిళపై నేరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులను భరోసా కేంద్రానికి తరలించి అవసరమైన వైద్యం చేయిస్తాం. బాధితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసి కోర్టులో న్యాయం జరిగేలా చూస్తాం. మహిళల రక్షణ కోసం షీటీంలో సీఐ పర్యవేక్షణలో మహిళా ఎస్‌ఐ, మహిళా ఏఎస్‌ఐ, ఏడు మంది మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు.
అవగాహన
కార్యక్రమాలు..
మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా ఉండటం కోసం పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు మఫ్టీలో పోలీసులు ఉంటారు.
సోషల్ మీడియా ద్వారా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. మహిళలు, చిన్నారులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలతోపాటు వ్యక్తిగత వివరాలు పోస్టు చేస్తుండటంతో సైబర్ నేరస్తులు వేధింపులకు పాల్పడున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకూడదు.


