మన్ననూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మన్ననూర్‌లోని ఎఫ్‌డీఓ కార్యాలయ ఆవరణలో అటవీశాఖ మహిళా సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పరిసర ప్రాంతంలోని వివిధ రేంజ్‌లకు చెందిన 50 మంది మహిళా ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. అటవీశాఖ ఉద్యోగులు విధుల నిర్వహణలో ప్రత్యేకించి మహిళా సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీఎఫ్‌ఓ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొంత మేరకై న పరిష్కరించేందు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించే దిశగా సఫారీ వాహనాలలో పర్యటన కోసం మహిళా ఉద్యోగులు అటవీ పరిసర ప్రాంతాలకు తరలివెళ్లారు. అంతకు ముందు వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు డీఎఫ్‌ఓ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు వీరేష్, దుర్గాప్రసాద్, ఈశ్వర్, రవికుమార్, శ్రీకాంత్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.


