నాగర్‌కర్నూల్ క్రైం/నాగర్‌కర్నూల్ రూరల్: ఇటీవల కుమ్మెరగట్టు జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కర్ణాటక మాజీ డీజీపీ రవీంద్రనాథ్ కోరారు. మంగళవారం కుమ్మెరగట్టులో మల్లన్న స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం గ్రామానికి వెళ్లి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు కుల,మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలసి జీవించాలని సూ చించారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఉన్నారు.
● జిల్లా కేంద్రంలోని నేషనల్ హైస్కూల్‌లో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాల సన్నాహాక సమావేశానికి మాజీ డీజీపీ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ జీవిత కీలక ఘట్టాలను తెలియజేశారు. శతజయంతి ఉత్సవాల్లో ఆయన విగ్రహావిష్కరణ ఆవశ్యకతను వివరించారు. అంతకుముందు ఐక్యత సమాజ సంస్థ అధ్యక్షుడు కళ్యాణ నర్సింహ, కార్యదర్శి బాగవేణి నర్సింహులు తదితరులు మహేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రమేశ్‌బాబు, పటాన్, అబ్దుల్లాఖాన్, వహీద్ ఖాన్, రవి, మురళీధర్, నర్సింహ, రవికుమార్, లంకెప్ప, బాలరాజు పాల్గొన్నారు.


