3 మున్సిపాలిటీలు.. 358 అభ్యంతరాలు
● మున్సిపాలిటీలలో ఓటరు డ్రాఫ్టుపై ముగిసిన గడువు
● నేడు తుది జాబితా విడుదల చేయనున్న అధికారులు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు విడుదల చేసిన ఓటర్ డ్రాఫ్ట్‌పై అభ్యంతరాల గడువు ముగిసింది. ఓటరు జాబితాపై ఈ నెల 1 నుంచి శుక్రవారం వరకు మున్సిపల్ అధికారులు అభ్యంతరాలు ఆయా మున్సిపాలిటీలలో స్వీకరించారు. ఇందులో జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 65 వార్డులకు కలిపి 358 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు తెలిపారు. స్వీకరించిన అభ్యంతరాలను ఒక్కొక్కటిగా ఆయా వార్డు ఆఫీసర్లు పరిష్కరించి, అధికారులకు నివేదికలు అందించారు. పరిష్కరించిన అభ్యంతరాలను మరోమారు తుది రూపు ఇచ్చి మున్సిపాలిటీల వారీగా శనివారం తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
ఎక్కువగా వార్డు మార్పులపైనే..
మున్సిపాలిటీలలో ఎక్కువగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చిన వాటిపైనే ఎక్కువగా అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చాలా వరకు ఇవే అభ్యంతరాలు రాగా.. మరికొన్ని ఓటర్లు కానీ వారు ఓటరు జాబితాలో ఉన్నారన్న అభ్యంతరాలు వచ్చాయి. వాటికి సంబంధించి అభ్యంతరాలను ఇప్పుడు పరిష్కరించలేమని అధికారులు ఫిర్యాదు చేసిన వారికి తెలిపినట్లుగా సమాచారం. అయితే ఓటరు జాబితాలో వేరే ఓటర్లు చేరికతో ఏమైనా వార్డుల రిజర్వేషన్లలో తేడాలు ఉంటాయేమోనని ఆశావహులు ఆందోళనలో ఉన్నారు.


