భూ సేకరణ వేగవంతం చేయాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల చివరి విడత భూ సేకరణ వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఆర్డీఓలు, నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, తహసీల్దార్లతో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారి నిర్మాణం కోసం భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. తాడూరు, బిజినేపల్లి, వెల్దండ, కల్వకుర్తి, తిమ్మాజిపేట, ఊర్కొండ, వంగూరు మండలాల్లో సేకరిస్తున్న భూసేకరణపై చర్చించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన చివరి దశ భూ సేకరణ పనులు వేగంగా జరగాలని, సాగునీటి ప్రాజెక్టులకు ఆటంకం లేకుండా సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సేకరణ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇంకా కావాల్సిన భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కొల్లాపూర్ రూరల్: వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మండలంలోని సింగోటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి విద్యార్థుల పరీక్ష సన్నద్ధత, విద్యా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు అడిగి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రోజువారి పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల హాజరు పెంచేందుకు తలిదండ్రులతో సమన్వయం పెంచి పాఠశాల కార్యక్రమాలలో భాగస్వాములు చేయాలన్నారు.


