హోరాహోరీగా ‘సంగ్రామం’
స్వల్ప తేడాతోనే..
సాక్షి, నాగర్‌కర్నూల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల హోరాహోరు పోరు కొనసాగింది. మొత్తం ఎన్నికల ఫలితాల్లో అంతిమంగా కాంగ్రెస్ పైచేయి సాధించగా.. పలు మండలాల్లో బీఆర్‌ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. తొలివిడతలో మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు గాను 97 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా.. 39 స్థానాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిది చోట్ల ఎన్నికవగా.. బీజేపీకి 5 స్థానాలే వచ్చాయి. జిల్లాలోని తాడూరు మండలం గుంతకోడూరులో సీపీఐ పార్టీ బోణి కొట్టింది.
ఆరింట మూడు మండలాల్లో..
మొత్తం ఆరు మండలాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సర్పంచ్ స్థానాలు వచ్చాయి. అయితే మూడు మండలాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జోరు కొనసాగింది. తాడూరు మండలంలో మొత్తం 24 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 10 స్థానాలను గెలుచుకుంటే బీఆర్‌ఎస్ సైతం 9 స్థానాలను సొంతం చేసుకుంది. ఈ మండలంలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్ గట్టి పోటీనివ్వడం గమనార్హం. వెల్దండ మండలంలో 8, తెలకపల్లి మండలం 7, కల్వకుర్తి మండలంలో 7 సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. తాడూరు మండలంలోని అల్లాపూర్, ఏటిదర్పల్లి, ఇంద్రకల్, లచ్చురాంతండా, పర్వతాయిపల్లి, సిర్సవాడ, పాపగల్ గ్రామాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు సత్తా చాటారు. తెలకపల్లి మండలంలో నడిగడ్డ, బోళ్లగుండం, జమిస్తాపూర్, బోడబండతండా, అనంతసాగర్, పర్వతాపూర్, ఆలేరు గ్రామాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. వెల్దండ మండలంలోని అజిలాపూర్, బర్కత్‌పల్లి, చెదురుపల్లి, పోతేపల్లి, బొల్లంపల్లి, చెరుకూర్, నగరగడ్డతండా, రాఘాయపల్లి సర్పంచ్ స్థానాలు బీఆర్‌ఎస్‌కే దక్కాయి. అలాగే ఊర్కొండ, వంగూరు మండలాల్లో బీఆర్‌ఎస్ ఐదు స్థానాలు అంతకన్నా తక్కువ స్థానాలకే పరిమితమైంది. సీఎం రేవంత్ సొంత మండలమైన వంగూరులో 19, ఊర్కొండలో 10 స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది.
పంచాయతీ ఎన్నికల్లో
అభ్యర్థుల నడుమ గట్టి పోటీ
మొదటి విడతలో పలుచోట్ల
కాంగ్రెస్‌కు ఏమాత్రం తగ్గని బీఆర్‌ఎస్
చాలాచోట్ల తక్కువ తేడాతోనే
సర్పంచ్‌గిరిని కోల్పోయిన వైనం
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టిపోటీ కొనసాగింది. కొన్నిచోట్ల నువ్వా.. నేనా అన్న చందంగా చివరి వరకు ఉత్కంఠపోరు కొనసాగగా.. అతి తక్కువ మెజార్టీతో సర్పంచ్‌లుగా గెలుపొందారు. తాడూరు మండలంలోని గుట్టలపల్లిలో స్వతంత్ర అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారు చిందం అయన్నపై కేవలం 2 ఓట్ల తేడాతో సర్పంచ్ అయ్యారు. తెలకపల్లి మండలం బండపల్లిలో సురేందర్‌రెడ్డికి కేవలం 4 ఓట్లతో మెజార్టీతో సర్పంచ్‌గిరి దక్కింది. ఇదే మండలంలోని గట్టునెల్లికుదురులో చల్లా చంద్రారెడ్డి సైతం 7 ఓట్ల స్వల్ప తేడాతోనే విజయం సాధించారు. కల్వకుర్తి మండలం మొకురాల సర్పంచ్‌గా బీజేపీ మద్దతుదారు ఎల్లయ్య 12 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి మల్లేశ్ మీద గెలుపొందారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న స్వగ్రామం తెలకపల్లి మండలంలోని గౌరారంలో కాంగ్రెస్‌కు చెందిన బిరుదు మల్లీశ్వరి 19 ఓట్ల తేడాతోనే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చాలాచోట్ల అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయాలను కోల్పోయారు. అలాగే రెండు, మూడో విడతల్లోనూ ప్రధాన పార్టీలు, అభ్యర్థుల మధ్య హోరాహోరు పోరు కొనసాగనుంది.


