నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
కందనూలు/ బిజినేపల్లి: వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతిలో శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 6 పరీక్ష కేంద్రాల్లో 1,432 మంది, నాగర్‌కర్నూల్ 10 కేంద్రాల్లో 2,249 మంది, గద్వాల 4 కేంద్రాల్లో 997 మంది, వనపర్తి 5 కేంద్రాల్లో 1,099 మంది, నారాయణపేట 2 కేంద్రాల్లో 609 మంది, కొడంగల్ ఒక కేంద్రంలో146 మంది, షాద్‌నగర్ ఒక కేంద్రంలో 345 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకు గాను 29 పరీక్ష కేంద్రాల్లో 29 మంది సీఎస్‌లు, 29 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించామని ప్రిన్సిపాల్ తెలిపారు.
క్షయవ్యాధి నివారణకు
కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని క్షయ వ్యాధి నివారణ అధికారి రఫిక్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా జిల్లాలో మొబైల్ ఎక్స్‌రే యూనిట్ శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధిని పారదోలడానికి వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి తెమడ పరీక్షతోపాటు ఎక్స్‌రే ద్వారా వ్యాధిని గుర్తించాలనే సంకల్పంతో ముందుకెళ్తుందన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసే టీబీ వ్యాధి గుర్తింపు శిబిరాలకు మొబైల్ ఎక్స్‌రే మిషన్ తీసుకువెళ్లి వ్యాధి అనుమానితులందరికీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలన కోసం క్యాంపులు ఏర్పాటు చేసి ఎక్స్‌రే తీయించాలని ప్రోగ్రాం అధికారి టీబీ ఉద్యోగులకు సూచించారు. చేతితో పట్టుకెళ్లే మొబైల్ ఎక్స్‌రే సాధనం ద్వారా అందరికీ పరీక్షలు చేపట్టాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు అందజేసి నివారణకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాసులు, ఆరిఫ్, శరత్‌బాబు, ముక్తార్, రాజ్‌కుమార్, గౌరీకుమార్, సత్యారెడ్డి, రామచంద్రజి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి


