మంత్రి జూపల్లికి నిరసన సెగ
● ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని
గ్రామస్తుల అడ్డగింత
పెంట్లవెల్లి: రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో శుక్రవారం రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ మద్దతుదారు తరపున ప్రచారం చేస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది గ్రామస్తులు స్పందిస్తూ ‘మంత్రిగారు.. హామీలపై హామీలు ఇస్తారు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోతున్నారని’ గ్రామ సర్పంచ్ అభ్యర్థి, బీఆర్‌ఎస్ మద్దతుదారు మేడిపల్లి సరితాబిచ్చారెడ్డి అన్నారు. మా గ్రామానికి ఎక్కువ మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గ్రామస్తులు మంత్రితో నిరసన తెలిపారు. ఓటమి భయంతో హామీలు ఇవ్వడం కాదని వాటిని కచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం కాదని గోప్లాపూర్ గ్రామాన్ని గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేసి చూపిస్తానని, ఇందుకోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తానని పేర్కొన్నారు.


