ఓటింగ్.. 86.32 శాతం
● జిల్లాలో ప్రశాంతంగాతొలి విడత పంచాయతీ ఎన్నికలు
● ఉదయం 7 గంటల నుంచే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు
● అత్యధికంగా ఊర్కొండ మండలంలో 89.73..
● అత్యల్పంగా తెలకపల్లిలో 81.58 శాతం నమోదు
పర్వతాపూర్‌లో ఓటు వేస్తున్న మహిళ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 86.32 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం ఆరు మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు ఎన్నికలు చేపట్టాల్సి ఉండగా.. ఇందులో 14 సర్పంచ్, 208 వార్డుస్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా మొత్తం 137 సర్పంచ్, 1,118 వార్డుస్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. తెలకపల్లి మండలం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అత్యధికంగా ఊర్కొండ మండలంలో..
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 86.32 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా.. ఇందులో అత్యధికంగా ఊర్కొండ మండలంలో 89.73 శాతం.. తెలకపల్లి మండలంలో తక్కువగా 81.58 శాతం ఓటింగ్ జరిగింది. కల్వకుర్తి మండలంలో 88.02, తాడూరులో 87.54, వంగూరులో 85.85, వెల్దండ మండలంలో 88.43 శాతం ఓటింగ్ నమోదైంది. తెలకపల్లి మండలం చిన్నముద్దునూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. తొలి విడతలో 32 పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని తెలుసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు రాజ్యలక్ష్మితోపాటు 55 మంది మైక్రో అబ్జర్వర్లు తొలి విడత ఎన్నికల తీరును నిశితంగా పరిశీలించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ సాగాల్సి ఉండగా చాలాచోట్ల క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించారు. తెలకపల్లి, తాడూరు, వెల్దండ మండలాల్లో ఒంటిగంట దాటినా పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సర్పంచ్, వార్డుస్థానాలకు ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టారు.
మండలం 9 గంటలకు 11 గంటలకు ఒంటిగంట ముగింపు
కల్వకుర్తి 18.37 52.5 84.21 88.02
తాడూరు 19.69 52.4 80.57 87.54
తెలకపల్లి 14.18 46.9 76.83 81.58
ఊర్కొండ 17.93 51.6 75.63 89.73
వంగూరు 19.59 47.1 72.96 85.85
వెల్దండ 11.92 53.9 61.11 88.43
కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక..
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సరళి ఇలా..


