పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోవద్దు
నాగర్‌కర్నూల్/ బిజినేపల్లి: జిల్లాలో జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో 55 మంది మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణకు ఎన్నికల సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించడమే అత్యంత కీలకమని, పీఓలు, ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోవద్దని, పోలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల కల్లా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థుల ఏజెంట్లు మినహా మిగతా వారిని, సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు అనుమతించొద్దన్నారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 55 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, 55 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీపీఓ శ్రీరాములు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తప్పనిసరి
సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ నుంచి ఉపసంహరించుకునే వ్యక్తి నుంచి ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మండలంలోని పాలెం క్లస్టర్‌లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అభ్యర్థుల అన్ని పత్రాలను సక్రమంగా నమోదు చేయడం, అభ్యర్థులు పూర్తి సమాచారం అందించడం, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దారు మునీరుద్దీన్, ఎంపీడీఓ కథలప్ప తదితరులున్నారు.


