సరిహద్దుల్లో పటిష్ట నిఘా
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల ఏర్పాటు
● కోడ్ పక్కాగా అమలు చేసేందుకు ముమ్మర తనిఖీలు
అచ్చంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేసేందుకు జిల్లాలో బిజినేపల్లి, మన్ననూర్, వెల్దండ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765పై నిరంతర నిఘా ఉంటుంది. 24 గంటలపాటు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దు మీదుగా జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో అవసరం మేరకు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలు, అనుమానితులను విచారిస్తున్నారు.
రూ.50 వేలు మించితే..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చెక్‌పోస్టుల మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు నగదు, మద్యం తరలింపుపై అప్రమత్తంగా ఉండాలి. నగదు రూ.50 వేల వరకు తీసుకెళ్లొచ్చు. రూ.50 వేలకు పైబడి వెంట తీసుకెళ్తే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా మొదలుకొని తీసుకెళ్లున్న అవసరాలపై లెక్కలు చూపించాలి. వీటితోపాటు మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రేయింబవళ్లు అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
రంగంలోకి బృందాలు
పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండు, మూడు విడతల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకటి, రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రచారం మొదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు ఎంసీసీ, స్టాటిస్టికల్ సర్వేలైన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలు రంగంలోకి దిగాయి. నగదు, మద్యం అక్రమ రవాణా, పంపిణీకి అడ్డుకట్ట వేసేలా పోలీసు, రెవెన్యూ శాఖలు చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ప్రచార చిత్రాల తొలగింపు సహా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను వీడియోలు చిత్రీకరించనున్నారు.


