పవనసుతా.. పాహిమాం
అమ్రాబాద్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి క్షేత్రం స్వామివారి నామస్మరణతో మార్మోగింది. గత నెల 31న ప్రారంభమైన దీక్షమాల విరమణ బ్రహ్మోత్సవాలు గురువారం మగిశాయి. వేలాది మంది మాలధారణ భక్తులు 41 రోజుల కఠోర దీక్షల అనంతరం ఉత్సవాలలో దీక్షల విరమణ పొందారు. పవనసుతా.. పాహిమాం.. అంజనిపుత్ర వాయునందన, కాపాడయ్యా.. కరుణించయ్యా.. అంటూ భక్తులు స్వామిని స్తుతించిన తీరుతో మద్దిమడుగు క్షేత్రం పులకించిపోయింది. చివరి రోజు ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో గాయత్రి మహాయజ్ఞం
దీక్షమాల విరమణ ఉత్సవాల ముగింపు సందర్భంగా గాయత్రి మహాయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి గవ్యాంతర పూజలు, మన్యు సూక్తులతో సమీప కృష్ణానది నుంచి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తెచ్చి 108 కళశాలతో జలాభిషేకం, కుంబాభిషేకం చేశారు. ఆలయం ముందు నిర్మించిన యజ్ఞశాలలో హనుమాన్ మూలవిరాట్ విగ్రహాన్ని ఉంచి వేదపండితులు నీలకంఠశాస్త్రి, వీరయ్యశర్మ, షణ్ముఖశివప్రాదశాస్త్రిల బృందం మంత్రోచ్ఛరణాలతో యజ్ఞం జరపగా.. ఆలయ ఈఓ రంగాచారి, దీక్షమాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ సేవకు వెళ్లదీశారు. యాగశాలలో మహా పూర్ణాహుతి, అవభృతం స్నానం చేయించి అష్టాదశ కళశాలు, 1.25 లక్షల నాగవల్లి దళం (తమలపాకులు) స్వామివారికి సమర్పించారు. వేడుకలకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఏపీలోని గుంటూరు, ప్రకాశం తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
అంజన్న నామస్మరణతోపులకించిన మద్దిమడుగు
చివరిరోజు వైభవంగా గాయత్రి మహాయజ్ఞం
ముగిసిన దీక్షమాల విరమణ బ్రహ్మోత్సవాలు
పవనసుతా.. పాహిమాం


