అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ఎన్నికల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ, ఎంసీసీ అమలు, బ్యాలెట్ పత్రాల లెక్కింపు తదితర వాటిపై అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓల బాధ్యత అత్యంత కీలకం అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న తప్పిదం కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సమక్షంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు, ఎన్నికల సిబ్బందికి మౌలిక వసతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఓటర్లకు అనుకూల వాతావరణం కల్పించడం, పోలింగ్ మెటీరియల్ సక్రమ వినియోగం, బ్యాలెట్ పత్రాల లెక్కింపు, సీల్ విధానం వంటి అంశాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చోటుచేసుకోకూడదని, తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి దశలో జాగ్రత్తలు పాటించడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వ్యయ పరిశీలకులు భీమ్లానాయక్ మాట్లాడుతూ సర్పంచులు, వార్డుసభ్యుల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో చేస్తున్న వ్యయాలపై నిఘా పెట్టాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


