
‘స్థానిక’ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిద్దాం
నాగర్‌కర్నూల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల నియమావళిని అనుసరించి ఉండేలా రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి మీడియా ప్రతినిధుల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
● అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఎన్నికల నిబంధనల అమలు నేపథ్యంలో రాజకీయ పార్టీల గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని 10 వేలు అంతకంటే ఎక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థికి రూ.50 వేలుగా నిర్ణయించిందని, 10 వేల కంటే తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచి అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు అభ్యర్థికి రూ.30 వేలుగా నిర్ణయించారన్నారు.