
క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం జనరల్ ఆస్పత్రిలో నూతన క్షయవ్యాధి పరీక్ష నిర్ధారణ సీబీనాట్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌బీఐ ఆర్థిక సౌజన్యంతో భవిష్య భారత్ ట్రస్ట్ సీబీ నాట్ యంత్రాన్ని అందించారని, సీబీ నాట్ యంత్రం ద్వారా అనుమానిత రోగి కళ్లె పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు వారాల నుంచి దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, జ్వరం రావడం తదితర లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వెంటనే కళ్ల పరీక్ష చేయించుకోవాలన్నారు. జిల్లాలో గ్రామాన క్షయవ్యాధి పరీక్ష శిబిరాలు నిర్వహిసున్నారని, ఇందులో ఎక్స్‌రే, కళ్లె పరీక్షలు చేస్తారన్నారు. అనంతరం జనరల్ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతోపాటు పీపీ యూనిట్ తనిఖీ చేసి వ్యాక్సిన్ నిల్వలు పరిశీలించారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సీఎస్ ఆర్‌ఎంఓ రవిశంకర్, భవిష్య భారత్ జిల్లా మేనేజర్ సజ్జత్ అలీ, ల్యాబ్ టెక్నీషియన్ కల్యాణ్ కృష్ణారావు, సత్యారెడ్డి, ఎస్‌టీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.