
శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలకం
నాగర్‌కర్నూల్ క్రైం: దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరికీ హాని కలిగించకుండా, ఆయుధాలను దుర్వినియోగపరచకుండా దుష్ట సంహారం కోసం వాడేదే ఆయుధం అని, అలాంటి ఆయుధాలు, పరికరాలు, సమస్త యంత్రాలలో అంతర్లీనంగా దుర్గాదేవి చైతన్యశక్తి స్వరూపిణిగా కొలువుంటుందని, అందుకోసమే దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ నిర్వహిస్తామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం దుర్గాష్టమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ బలగాల కార్యాలయంలో ఎస్పీ ఆయుధ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు ఎంతో ముఖ్యమన్నారు. పోలీసులు తీవ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకొని దేశ ప్రజలను రక్షించడం కోసం ఆయుధాలను వాడతారన్నారు. ఆయుధాలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, యూనిఫాం సర్వీసుల్లో మన శరీరంపై ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒక ఆయుధంగా సందర్భాన్ని బట్టి పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షలు స్కాలర్‌షిప్ అందించే అవకాశం ఉందన్నారు. డిగ్రీలో 60 శాతం మార్కులు, టోఫిల్ ఉత్తీర్ణత, పాస్‌పోర్టు, వీసా, విదేశీ విశ్వవిద్యాలయం ప్రవేశపత్రం ఉండి వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు http://tgepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
డ్రైవింగ్ శిక్షణకు
దరఖాస్తుల స్వీకరణ
మన్ననూర్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోహిత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఐటీడీఏ సమక్షంలో చెంచు యువతకు టీజీఎస్ ఆర్టీసీ హకీంపేటలో 41 మంది చెంచు యువతకు లైట్ మోటార్ వెహికిల్ (33) (ఎల్‌ఎంవీ), హెవీ మోటార్ వెహికిల్ (8) (హెచ్‌ఎంవీ) డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారన్నారు. చెంచు యువకుల్లో ఆసక్తి గలవారు TSLPRB వెబ్‌సెట్ (www. tgprb.in)లో ఈ నెల 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకు గాను పూర్తి వివరాలు www.tgprb.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
నూతన బస్‌స్టేషన్
నిర్మాణానికి ఉత్తర్వులు
కందనూలు: జిల్లాకేంద్రంలో నూతన బస్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కృషితో రూ.10.80 కోట్లతో అత్యాధునిక హంగులతో మరో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.