
గ్రామ ‘రెవెన్యూ’కు పునర్‌వైభవం
జిల్లాలో 189మంది జీపీఓల నియామకం
● గతంలో పనిచేసిన వీఆర్‌ఓ,
వీఆర్‌ఏలకు అవకాశం
● సొంత మండలం,
నియోజకవర్గంలో విధులకు బ్రేక్
● బలోపేతం దిశగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ
అచ్చంపేట: జిల్లాలో గ్రామ పాలన పునర్ వైభవం సంతరించుకుంటోంది. గ్రామ పరిపాలన అధికారుల (జీపీఓ) నియామకంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన పునరుజ్జీవం పోసుకుంటోంది. జిల్లాకు 189 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించగా.. ఇటీవల కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్ నియామక పత్రాలను అందజేశారు. మండలాల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాలను కేటాయించారు. జీపీఓల సొంత మండలం, నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు.
ఐదేళ్ల నిరీక్షణకు తెర..
క్షేత్రస్థాయిలో రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని 2020 ఆగస్టు 1న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసింది. 2023 ఆగస్టు 10న వీఆర్‌ఏ వ్యవస్థను కూడా రద్దుచేసింది. సదరు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను జిల్లాలోనే వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి పోస్టింగ్ కల్పించారు. మరికొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఐదేళ్లుగా గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ స్తంభించాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. తిరిగి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జీపీఓల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా మళ్లీ గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలుగా విధులు నిర్వర్తించిన వారికి అర్హత పరీక్ష నిర్వహించి జీపీఓలుగా ఎంపిక చేశారు.
గ్రామస్థాయిలో కీలకం..
జీపీఓలు గ్రామస్థాయిలో కీలకంగా మారనున్నారు. భూ భారతి, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలవడం తదితర విధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో బీఎల్‌ఓలుగా కూడా వ్యవహరించనున్నారు.
జిల్లాలో 189 క్లస్టర్లు..
జిల్లాలో 20 మండలాల్లో నాలుగు రెవెన్యూ డివిజన్లు, 460 గ్రామపంచాయతీల పరిధిలోని 350 రెవెన్యూ గ్రామాలను 189 క్లస్టర్లుగా నిర్ణయించారు. మొదటిసారి 127 మంది వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 112 మంది పరీక్ష రాయగా.. 67 మంది అర్హత సాధించారు. రెండో సారి 66 మంది ఆప్షన్లు ఇవ్వగా.. 55 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 45మంది అర్హత సాధించారు. ఆసక్తి ఉండి పరీక్ష రాసి అర్హత సాధించిన 112 మందిని జీపీఓలుగా నియమించారు. వీరితో పాటు రెవెన్యూశాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 77 మంది అప్పటి వీఆర్‌ఏలను డిప్యూటేషన్‌పై అడిషనల్ జీపీఓలుగా ఎంపిక చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది.
రెవెన్యూ
కార్యాలయం