
స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిద్దాం
పోరాటయోధురాలు ఐలమ్మ..
నాగర్‌కర్నూల్: జిల్లాలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సన్నద్ధం కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్, సహాయ అధికారులు, సిబ్బందికి తొలి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో నిర్వహిస్తున్నందున అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. నామినేషన్ల ప్రక్రియను సమయపాలనతో నిర్వహించాలని ఆయన సూచించారు. నామినేషన్ స్వీకరణ గదిలో తప్పనిసరిగా గోడ గడియారం ఉండాలన్నారు. నిబంధనలు పాటిస్తే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతాయని కలెక్టర్ వివరించారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అమరేందర్, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, డీపీఓ శ్రీరాములు, అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించాలి
నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తే చర్యలు
కలెక్టర్ బదావత్ సంతోష్
జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద రైతుల పక్షాన పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో చాకలి ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారన్నారు. తెలంగాణ పౌరుషం, పోరాటం, త్యాగం భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన మహనీయురాలు అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి బీసీ వెల్ఫేర్ అధికారి యాదగిరి, డీఈఓ రమేశ్‌కుమార్, డీవైఎస్‌ఓ సీతారాం నాయక్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ పాల్గొన్నారు.