
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
అచ్చంపేట రూరల్: తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డెయిలీ వైజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాల్లో విధులు నిర్వర్తిస్తున్న డెయిలీ వైజ్ వర్కర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం అచ్చంపేటలో వర్షంలోనూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాల్లో రోజువారీ వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 15 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికులకు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో భరత్, రాజు, పద్మ పాల్గొన్నారు.