
‘టీఎల్‌ఎం‘ మేళాకు వేళాయె..
నేడు జిల్లాస్థాయిలో ప్రదర్శన
ఎంపిక ఇలా..
● దృశ్య, శ్రవణ అనుభూతితో
దీర్ఘకాల జ్ఞాపకం
● విద్యార్థుల్లో నేర్చుకోవాలనే
ఆసక్తి పెంపుదల
● పాల్గొననున్న 20 మండలాల
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు
మండల స్థాయిలో టీఎల్‌ఎం మేళాను పూర్తిచేశాం. జిల్లాస్థాయిలో నిర్వహించే టీఎల్‌ఎం మేళాకు ప్రతి మండలం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. దీన్ని ద్వారా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను అకట్టుకోవచ్చు.
– రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
కందనూలు: ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల్లో అక్షర బీజాలు నాటి.. వారిని చదువులో ముందుకు నడిపించేందుకు విద్యాశాఖ వినూత్న పద్ధతులు పాటిస్తోంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే దిశగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తోంది. అందులో భాగంగా మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఎల్‌ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వినూత్న బోధనా పద్ధతులు పాటించడం.. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించడం టీఎల్‌ఎం దోహదపడుతుంది.
1 నుంచి 5వ తరగతి వరకు..
జిల్లావ్యాప్తంగా గత నెలలో 1నుంచి 5వ తరగతి వరకు మండలస్థాయిలో టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. మొత్తం 20 మండలాల్లో ఎంపికై న ఉత్తమ టీఎల్‌ఎంలను గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హైస్కూల్‌లో నిర్వహించే జిల్లాస్థాయి మేళాలో ప్రదర్శించనున్నారు. ఇందులో భాషా పాఠాలు, అక్షరమాల, పద బంధాలు, కథాచిత్రాలు, గణితం, సంఖ్యా మోడళ్లు, ఆకారాలు, కొలతలు, గణన పద్ధతులు, పర్యావరణం, జంతువులు, పక్షులు, రుతువులు, చారిత్రక స్మారకాలు, సంప్రదాయాలు, సైన్స్ ప్రయోగాలు తదిత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్‌ఎంలలో జోడించి ప్రదర్శించనున్నారు. వీటి ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతో పాటు దృశ్య అనుభూతి కలుగుతుంది. టీఎల్‌ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది.
సులువుగా అర్థమయ్యేలా..
బోధన ప్రక్రియను సులభతరం చేసి.. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతి వస్తువు, వనరు, పరికరం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ సాధనాలను టీఎల్‌ఎం బోధనలో ఉపయోగిస్తారు.
మెరుగైన ఫలితాలే లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతంపైగా పేద విద్యార్థులే చదువుతుంటారు. వీరి తల్లిదండ్రులకు విద్యాభ్యాసం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో కనీస సామర్థ్యాలు పెంపొందించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ విధానంలో తొలుత 45 నిమిషాల పాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత పాఠ్యాంశానికి సంబంధించిన సామగ్రిని ప్రదర్శించి.. విద్యార్థులతో అభ్యసనం చేయిస్తారు. దీంతో విద్యార్థులు వేగవంతంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు: 497
ప్రాథమికోన్నత: 124
విద్యార్థులు: 26,203
ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను మండల స్థాయిలో ఎంఈఓ పర్యవేక్షణలో ప్రదర్శించారు. ఎన్‌సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి మండల స్థాయిలోని పది ఉత్తమ టీఎల్‌ఎంలను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాల్లో రెండేసి.. అన్నింటిలో ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యా నిపుణులతో కూడిన జ్యూరీని నియమించారు. జిల్లాస్థాయిలో డీఈఓ ఆధ్వర్యంలో ఆరుగురు నిపుణుల జ్యూరీ కమిటీ అగ్రభాగాన నిలిచిన ఎనిమిది ఉత్తమ టీఎల్‌ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు.

‘టీఎల్‌ఎం‘ మేళాకు వేళాయె..