
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా అచ్చంపేటకు వచ్చిన గువ్వల బాలరాజుకు స్థానిక బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మహిళ లు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రజాకార్ల పాలనను కాంగ్రెస్ ప్రభు త్వం తలపిస్తుందని అన్నారు. గతంలో తనను ఓడించడానికి బీఆర్‌ఎస్ నాయకులే కుట్రలు చేశార ని గువ్వల ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాగా, పట్టణంలో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కార్యకర్తలకు ముందస్తు హెచ్చరికలు చేయడంపై అసహనం వెలిబు చ్చారు. మరోవైపు అంబేడ్కర్ విగ్రహం చుట్టూ బీజేపీ జెండాలు కట్టారని అంబేడ్కర్ సంఘం, దళిత సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదుతో మున్సిపల్ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో బీజేపీ జెండాలు, తోరణాలను తొలగించారు. అయితే ఓర్వలేకనే కుట్ర పూరితంగా కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. లింగాల చౌరస్తా లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మంగ్యానాయక్, బాలాజీ, రామోజీ, సీతారాంరెడ్డి, మహేందర్, శంకర్ పాల్గొన్నారు.