
సామాజిక న్యాయం దిశగా అడుగులు..
పాల ఉత్పత్తిలో
రాష్ట్రంలోనే రెండోస్థానం..
విద్య, వైద్యరంగాల అభివృద్ధి..
పేదల సొంతింటి కల సాకారం..
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలకు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేరుస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించి ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 2.58 లక్షల దరఖాస్తులకు గాను 56వేల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే 11,622 ఇళ్లను కేటాయించి.. 6,599 ఇళ్లకు మార్కింగ్ పూర్తిచేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రైతుబీమా పథకాలతో పాటు సన్నరకం వరిధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 14,757 మంది రైతులకు రూ. 39.51 కోట్ల బోనస్ చెల్లించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచామన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలో విద్యార్థులు లేక మూతబడిన 23 పాఠశాలలను తిరిగి ప్రారంభించామని చెప్పారు. 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామన్నారు. ● జిల్లాలోని 22 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులు బోధిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సైతం ముఖ గుర్తింపు హాజరు వర్తింపజేశామని.. దీంతో ఉపాధ్యాయుల హాజరు శాతం, సమయపాలన మెరుగుపడిందన్నారు. సమగ్ర మహిళా ఆరోగ్య పథకం కింద మహిళలకు 8 రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 17,883 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. రహదారుల విస్తరణకు హైబ్రిడ్ ఆన్యూటీ మోడల్ కింద రూ. 166కోట్ల నిధులతో 16.60 కి.మీ. మేర పనులు మంజూరు చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో రోజుకు 72,716 లీటర్ల పాలను సేకరిస్తున్నామని చెప్పారు. పాల సేకరణలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. గోవులు, గేదెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయిల్‌పాం తోటల సాగును ప్రోత్సహిస్తూ.. రైతుల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 200 మంది రైతులతో 753 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు నాటించామన్నారు.

సామాజిక న్యాయం దిశగా అడుగులు..