
ఈపీఎఫ్ అవకతవకలపై విచారణ
జడ్చర్ల టౌన్: స్థానిక పురపాలికలో 2012–2104 ఆర్థిక సంవత్సరాల్లో కార్మికుల వేతనాల్లో విధించిన ఈపీఎఫ్ కోతల డబ్బులను వారి ఖాతాలో జమ చేయలేదు. దీంతో కార్మికులు వివిధ కారణాలతో మృతిచెందితే వారి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. ఈ విషయంపై మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ అనేక దఫాలు ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2025, మే 30న యూనియన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు, విన్నపాలకు స్పందించి సోమవారం విచారణ నిమిత్తం హైదరాబాద్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కేతన్ పుర కార్యాలయానికి వచ్చారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మనోజ్‌తో సమావేశమయ్యారు. 2012–2014లో పనిచేసిన కార్మికుల వివరాలతో పాటు ఇప్పటి వరకు మృతిచెందిన వారి జాబితా ఇవ్వాలని సూచించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2012–2014 మధ్య జరిగిన ఈపీఎఫ్ లోపాల గురించి వెంకటేశ్ ఆయనకు వివరించారు. ఇప్పటి వరకు 46 మంది కార్మికులు మృతిచెందగా ఏ ఒక్కరికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలిపారు. కార్మికుల వేతనాల్లో డబ్బులు కట్ చేసి పీఎఫ్ ఖాతాలో జమ చేయనందునే ఈ పరిస్థితి తలెత్తిందని తెలియజేశారు. విచారణ అధికారి కేతన్ మాట్లాడుతూ.. పీఎఫ్ నిధికి మున్సిపల్ కార్యాలయం నుంచి జమచేసిన రూ.40 లక్షలను కార్మికుల జాబితా ప్రకారం వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు వర్తించే హక్కుల గురించి అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి వికసిత్ రోజ్‌గార్ యోజన ద్వారా నెలకు రూ.15 వేలు ఎలా పొందాలో తెలియజేశారు. విచారణ అధికారిని కలిసిన వారిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఇందిరమ్మ, కార్మికులు ఉన్నారు.
అధికారికి సమస్యలు విన్నవించిన
పుర కార్మికులు