
ఎట్టకేలకు.. బోనులోకి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను రెండున్నర నెలలుగా భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. జిల్లాకేంద్రానికి అతి సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట, వీరన్నగట్టు, డంపింగ్ యార్డుల్లో తిరగాడుతున్న చిరుతను బంధించేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. వీరన్నపేట సమీపంలో తిర్మల్‌దేవునిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన బోనులోని మేకపిల్లను తినేందుకు వచ్చిన చిరుత సోమవారం బోనుకు దొరికిపోయింది. దీంతో పట్టణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రం శివారులోని గుట్టల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు కొంతకాలంగా అటవీ, పోలీసు, మున్సిపల్ శాఖల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ చేసినా తప్పించుకు తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ట్రాప్, సీసీ, లైవ్ కెమెరాలతో చిరుత సంచారాన్ని నిరంతర పర్యవేక్షణ చేసి ఎట్టకేలకు బోనుకు చిక్కేలా చేశారు. కాగా.. బోనులో పడిన చిరుత బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో తల ముందుభాగంలో స్వల్పగాయాలయ్యాయి. చిరుతను ట్రాక్టర్‌లో జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించి.. అక్కడ వెటర్నరీ వైద్యు లతో చికిత్స అందించారు. అనంతరం కలెక్టర్ విజ యేందిర, డీఎఫ్‌ఓ సత్యనారాయణ సమక్షంలో డీసీ ఎం వాహనంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలజికల్ పార్క్‌కు తరలించారు. అక్కడ వెటర్నరీ వైద్య నిపుణులు చిరుతకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 18 నెలల వయసుతోపాటు ఆడపులిగా నిర్ధారించినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు.
అప్రమత్తంగానే ఉండాలి..
జిల్లాలో అడవులు పెరిగిన నేపథ్యంలో చిరుతల సంఖ్య పెరిగింది. ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగానే ఉండాలి. వీరన్నపేట సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట వద్ద బోనులో చిక్కిన చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించాం.
– సత్యనారాయణ, డీఎఫ్‌ఓ
5 బోన్లు ఏర్పాటు..
టీడీగుట్ట, శ్మశాన వాటిక ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ, పోలీసు అధికారులు, సిబ్బంది రెండున్నర నెలలుగా నిరంతరాయంగా శ్రమించారు. ఎప్పటికప్పుడు చిరుత కదలికలను పసిగట్టేందుకు ఆయా ప్రాంతాల్లో 20 ట్రాప్ కెమెరాలు, 5 లైవ్ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు 2 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. ఎలాగైనా చిరుతను బంధించేందుకు 5 బోన్లు ఏర్పాటు చేశారు.
రెండున్నర నెలలుగా ముప్పుతిప్పలు పెట్టిన చిరుత
తాజాగా తిర్మల్‌దేవునిగుట్ట వద్ద పట్టుబడిన వైనం
హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కుకు తరలింపు
ఊపిరి పీల్చుకున్న పాలమూరు పట్టణవాసులు

ఎట్టకేలకు.. బోనులోకి