
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మల్దకల్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మల్లెందొడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మల్లెందొడ్డికి చెందిన వెంకటేష్ (30) హోటల్ కొనసాగిస్తూ జీవనం సాగించేవాడు. భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవల కారణంగా ఈ నెల 11న భార్య పద్మ వేడి నూనెను వెంకటేష్‌పై పోయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు గద్వాలకు తరలించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ నందీకర్ తెలిపారు. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
లింగాల: వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొత్తకుంటపల్లికి చెందిన ఇరగోటి మల్లమ్మ(42) చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. లింగాల నుంచి స్వగ్రామమైన కొత్తకుంటపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త మల్లయ్య, నలుగురు సంతానం ఉన్నారు. మృతురాలి కుమారుడు విష్ణుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.