
పగలు బొంతలు కుట్టే పని.. రాత్రికి చోరీలు
వనపర్తి: ఖాకీ సినిమా తరహాలో ఉదయం జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నట్లుగా జనావాసాల మధ్య సంచరిస్తూ.. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకుని రాత్రి సమయంలో దోపిడికి పాల్పడుతున్న బొంతలు కుట్టే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం రూరల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి ముందస్తు పథకం ప్రకారం ఒక వ్యాన్‌లో బొంతలు కుట్టే వృత్తి పేరుతో గ్రామాల్లో తిరుగుతారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో తమ వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో ఇంటి తాళం, బీరువాలను పగలగొట్టి బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు ఎత్తుకెళ్తారు. ఇటీవల ఇలాంటి చోరీ వనపర్తి మండలంలోని పెద్దగూడెంతండాలో చోటుచేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ముఠాను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ నెల 14న సాయంత్రం పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలు చేపట్టారు. మినీ వ్యాన్‌లో ఇనుప రాడ్డలతో అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న వారిని విచారించగా.. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కొండ హరికృష్ణ, గజ్జుల కృష్ణయ్య, గజ్జుల వినోద్, గజ్జుల భాగ్యలక్ష్మితో పాటు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన గుజ్జుల రాజశేఖర్, గుజ్జుల లక్ష్మిని రిమాండ్‌కు తరలించారు. వీరిపై పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 25 వేల నగదు, 25 గ్రాముల బంగారం, 43 తులాల వెండి, ఓమిని కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు జలంధర్‌రెడ్డి, వేణుగోపాల్, కానిస్టేబుళ్లు రఫీ, అంజనేయులును డీఎస్పీ అభినందించారు.