
గుప్తనిధుల కోసం గుడిగోపురం ధ్వంసం
బల్మూర్: గుప్తనిధి కోసం గుర్తు తెలియని దుండగులు గుడిగోపురం ధ్వంసం చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మండలంలోని బాణాల సమీపంలోని పురాతన కాకతీయుల నాటి శివాలయంపై గోపురాన్ని దుండగులు ధ్వంసం చేసి గుప్తనిధి కోసం ప్రయత్నించారు. గమనించిన గ్రామస్తులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివాలయంపై ఉన్న గర్భగుడి గోపురాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో కొంతభాగం కిందపడిన అనవాలు అక్కడ ఉన్నాయి. శివాలయం గ్రామానికి దూరంగా ఉండడంతో దుండగులు ఇందుకు బరితెగించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా శివాలయం లోపలి భాగంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని, పోలీసులు దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.