
తీరని యూరియా కష్టాలు
జిల్లాకేంద్రంలో మళ్లీ రోడ్డెక్కిన అన్నదాతలు
● సింగిల్‌విండో ఎదుటప్రధాన రహదారిపై ధర్నా
● రోజుల తరబడి నిరీక్షించినా
బస్తా యూరియా అందడం లేదని ఆందోళన
● పంటలకు సరిపడా ఎరువులు అందించాలని వేడుకోలు
15 రోజులుగా వస్తున్నా..
నేను ఈ సారి 3 ఎకరాల్లో పత్తి, వరి పంటలు సాగుచేశాను. ఇప్పటివరకు పంటలకు యూరియా వేయకపోవడంతో సరిగ్గా ఎదగలేదు. ఎక్కడికి వెళ్లినా యూరియా దొరకడం లేదు. జిల్లాకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయానికి 15రోజులుగా వస్తున్నాను. ఎప్పుడు వచ్చినా యూరియా దొరకడం లేదు. – ఆంజనేయులు,
రైతు, కుమ్మెర, నాగర్‌కర్నూల్ మండలం
ఉదయం నుంచే క్యూలో..
మాకు ఉన్న 4 ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నాం. యూరియా కోసం 10రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఉదయం 6 గంటలకే వచ్చి లైన్‌లో నిలుచున్నా యూరియా అందడం లేదు. ఎన్ని రోజులు ఎదురుచూసినా ఇదే పరిస్థితి. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా సరఫరా చేయాలి.
– ఎల్లమ్మ, మహిళా రైతు, శ్రీపురం
సర్దుబాటు చేస్తున్నాం..
జిల్లాలో అవసరమైన యూరియాను ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఎక్కడా స్టాక్ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాం. గోదాం, ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకంపై సైతం అవగాహన కల్పిస్తున్నాం. – యశ్వంత్‌రావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సాక్షి, నాగర్‌కర్నూల్: వానాకాలం పంటలు వేసుకుని నెల రోజులు దాటినా జిల్లా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలు, గోదాముల వద్ద నిరీక్షిస్తున్నారు. భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి నిత్యం పడిగాపులు కాసినా యూరియా లభించని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సైతం యూరియా లభించక జిల్లాకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎదుట ప్రధాన రహదారిపై రైతన్నలు ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులను శాంతింపజేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
నెలరోజులు దాటినా..
జిల్లాలో నెలరోజుల క్రితమే వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ప్రారంభమైంది. పంటలకు యూరియా వేద్దామనుకున్న రైతులకు ప్రారంభం నుంచే యూరియా కొరత నెలకొంది. సీజన్ ప్రారంభంలో డిమాండ్ ఎక్కువగా ఉండి.. తర్వాత తగ్గుముఖం పడుతుందనుకుంటే నెల రోజులు దాటినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అదునుకు యూరియా వేయకపోవడంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సరిగ్గా ఎదగడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి ఎదురుచూస్తున్నా యూరియా లభించక రోడ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వెల్దండ, అచ్చంపేట, లింగాల మండలాల్లో తీవ్రమైన యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం
అందుబాటులో ఉన్నది
569 మె.ట.

తీరని యూరియా కష్టాలు