
పొదుపు మహిళలకు చీరలు
● ఒక్కొక్కరికి రెండు చొప్పున పంపిణీ
● వారం రోజుల్లో జిల్లాకు చేరుకోనున్న చీరలు
● జిల్లాలో 1,78,741 మంది సభ్యులు
ఏర్పాట్లు చేస్తున్నాం..
ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరో వారం రోజుల్లో జిల్లాకు చీరలు చేరుకోనున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు గోదాంలో భద్రపరిచి.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు తరలించి సభ్యులకు అందజేస్తాం. – ఓబులేషు, డీఆర్డీఓ
నాగర్‌కర్నూల్/అచ్చంపేట: స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద ప్రతి సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను పంపిణీకి సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వం రేషన్ కార్డుల్లో సభ్యులైన ప్రతి మహిళకు ఒక చీర చొప్పున పంపిణీ చేయగా.. గతేడాది చీరల పంపిణీకి బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండేసి చొప్పున చీరలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇప్పటికే స్వయం సహాయక సంఘాలు ఎన్ని ఉన్నాయి.. ఎంత మంది సభ్యులు ఉన్నారనే వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అందుకు అనుగుణంగా జిల్లాకు చీరలు సరఫరా చేయనున్నారు.
వివిధ రకాల డిజైన్లు..
గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు రూ.500 పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లు జోడించారు. మరో వారం రోజుల్లో జిల్లాకు చీరలు చేరుకోనున్నాయి. ఈ నెల 23నుంచి చీరల పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాకు సరఫరా చేసే చీరలను జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఉన్న గోదాంలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయా మండలాలు, గ్రామాలకు తరలించనున్నారు.
జిల్లాలో 17,874 సంఘాలు..
జిల్లాలో 17,874 మహిళా సంఘాలు ఉండగా.. 1,78,741 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. కాగా, గతంతో పోలిస్తే ఈసారి చీరలు నాణ్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. చీరల పంపిణీకి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్రామస్థాయిలో ఐకేపీ, మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలను అప్పగించనున్నారు.