
నష్టపరిహారం చెల్లించండి
కోడేరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కోడేరు మండలం తీగలపల్లిలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. శనివారం భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. నష్టపరిహారం కోసం రైతులు 13 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా పాలకులు ఏమి పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. తీగలపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో 70మంది రైతులు 43 ఎకరాల భూమిని కోల్పోయారని.. ప్రభుత్వం కొందరికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తగదన్నారు. భూమి కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధు, శివకుమార్, పద్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.
నూతన జాతీయ విద్యావిధానం ప్రమాదకరం
కందనూలు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం–2020 అత్యంత ప్రమాదకరమని.. ఈ విధానం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. శనివారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అఖిలభారత అధ్యక్షుడు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభతో పాటు ‘నూతన జాతీ య విద్యా విధానం‘ అంశంపై సెమినార్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని పెంచడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి విద్యను వాణిజ్యీకరణ చేస్తుందని ఆరోపించారు. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులో లేకుండా చేస్తుందన్నారు. మరోవైపు ఫీజుల పెరుగుదలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వల్ల అసమానతలు మరింత పెరుగుతాయన్నారు. కొఠారి కమిషన్ సూచన మేరకు జీడీపీలో 6శాతం, కేంద్ర బడ్జెట్‌లో 10శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ వర్మ, జిల్లా అధ్యక్షుడు పి.శివశంకర్, కార్యదర్శి నాగపూర్ మధు, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

నష్టపరిహారం చెల్లించండి