
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించాలి
అచ్చంపేట రూరల్: విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కేవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ ఫైబర్ వైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. స్తంభాలపై 15మీటర్ల ఎత్తులో కేబుళ్లను అమర్చుకోవాలని.. ఒక్కో స్తంభానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సపోర్టింగ్ వైర్లు కేబుల్ గరిష్ట బరువు మీటర్‌కు 200 గ్రాములకు మించరాదన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారని.. ఇకపై నెలవారీ బిల్లులు వసూలు చేస్తామన్నారు. ప్రమాదకరంగా మారిన వైర్లను సరిచేసుకోవడానికి కొంత గడువు ఇస్తామని.. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన పరిశీలించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అచ్చంపేట నుంచి మన్నెవారిపల్లిలోని ఎస్‌ఎల్‌బీసీకి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఎస్‌ఈ వెంట ఎస్‌ఏఓ పార్థసారధి, ఏఈ ఆంజనేయులు, సిబ్బంది మహేశ్, లక్ష్మణ్, లాలయ్య తదితరులు ఉన్నారు.