
వేతన వెతలు..
పని బారెడు.. జీతం చారెడు
జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లకు 6 నెలలుగా అందని జీతాలు
●
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు రావడం లేదు. డెయి లీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తుండగా.. ఇప్పుడు వేతనాలు నిలిచిపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి కార్మికులు నిరవదిక సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో హాస్టళ్ల నిర్వహణపై ఆందోళన నెలకొంది.
గతంలో కలెక్టర్ గెజిట్ ద్వారా డెయిలీ వేజ్ లేబర్‌కు వేతనాలు చెల్లించేవారు. ఈ క్రమంలో కార్మికులకు ప్రతినెలా రూ. 13,500 చొప్పున వేతనం లభించిందని కార్మికులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీఓ 64 అమలు చేయడంతో వేతనం తగ్గిందని అంటున్నారు. ఎక్కడైనా ఏళ్లు గడిచిన కొద్ది జీతం పెరగాల్సి ఉండగా.. ఈ జీఓ ఫలితంగా తమ జీతం రూ. 11,700కే పరిమితమైందని ఆవేదన చెందుతున్నారు. ఈ వేతనం సైతం ఆరు నెలలుగా నిలిచిపోవడంతో వారిలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. డైలీ వేజ్ వర్కర్ల వేతనాలను ఒక్కో జిల్లాల్లో ఒక్కో తీరుగా అమలు చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని ఖమ్మం తదితర జిల్లాల్లో కార్మికులకు ప్రతినెలా రూ. 26వేల వరకు అందుతోందని.. జిల్లాలో మాత్రం కేవలం రూ. 11,700 అందుతోందని కార్మికులు వాపోతున్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు అందించాలని, తమకు టైం స్కేల్ వర్తింపజేయాలని, ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల,
హాస్టళ్ల కార్మికుల పరిస్థితి దైన్యం
నెలనెలా వేతనాలు అందించాలని డిమాండ్
గిరిజన ఆశ్రమ హాస్టళ్ల ఎదుట
నిరవదిక సమ్మెకు దిగిన కార్మికులు
జిల్లాలోని 29 గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో సుమారు 150మంది కార్మికులు డెయిలీ వేజ్ లేబర్‌గా పనిచేస్తున్నారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, వంట పని, విద్యార్థులకు వడ్డించడం తదితర పనులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. రోజు ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటీవల భోజనం మెనూలో చేసిన మార్పుల ఫలితంగానూ తమపై పనిభారం పెరిగిందని అంటున్నారు. అయితే సుమారు 15 ఏళ్లుగా కార్మికులుగా పనిచేస్తున్నా.. నెలకు రూ. 11,700 మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోని వేతనాలతో తాము ఇబ్బందులు పడుతుండగా.. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ సైతం కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు.