
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం
కొల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని.. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్లాపూర్‌లో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులను ఎంపిక చేసి.. నిజమైన పేదలకు అన్యాయం చేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని ఓవైపు ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతుంటే.. స్థానికంగా మాత్రం అందుకు విరుద్ధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించాలని వారు కోరారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కేవరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. సీపీఐ నాయకులు ఇందిరమ్మ, కుర్మయ్య, కిరణ్‌కుమార్, తుమ్మల శివుడు, యూసూఫ్, జంగం శివుడు, చందు, శంకర్, శివకృష్ణ, శేఖర్, దామోదర్, రమేశ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.