
షేర్‌వాల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇళ్లు
● గృహనిర్మాణశాఖ అధికారులు
ప్రత్యేక శ్రద్ధ చూపాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో షేర్‌వాల్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలో షేర్‌వాల్ టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ముందుగా 20వ వార్డు ఈదమ్మగుడి సమీపంలో లబ్ధిదారుడు రవిశంకర్ ఇంటిని సందర్శించి.. పనుల పురోగతిని తెలుసుకున్నారు. 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారుడికి అప్పగించాలని ఆయన సూచించారు. అనంతరం 13వ వార్డులో బొంద మల్లమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇటుకలు అవసరం లేకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో కేవలం 20 రోజుల్లోనే ప్రభుత్వం అందించే రూ. 5లక్షలతో పక్కా ఇల్లు నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీకి మొత్తం 442 ఇళ్లు మంజూరు కాగా.. 248 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగిలిన ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించి.. వేగవంతంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. షేర్‌వాల్ టెక్నాలజీతో కొనసాగుతున్న ఇళ్ల పనుల పూర్తిపై మున్సిపల్, గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.