
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
కందనూలు: ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నట్లు డీఐఈఓ వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఏర్పాటుచేసిన స్వాగతోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉందన్నారు. ఇందుకు అధ్యాపకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో
నిర్లక్ష్యం వద్దు
తెలకపల్లి: వైద్యసిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. శుక్రవారం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు ఏఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు.. ప్రభుత్వ అనుమతులు తదితర వాటిని పరిశీలించారు. అయితే ఆస్పత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సంబంధిత పత్రాలను డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు ఉన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య