
రాజీయే రాజమార్గం
అవగాహన కల్పించాం..
● నేడు జాతీయ లోక్‌అదాలత్
● అప్పీల్ లేకుండా కేసుల పరిష్కారం
● కక్షిదారులకు సత్వర న్యాయం
కల్వకుర్తి టౌన్: కోర్టు పరిధిలోని చిన్నచిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికి లోక్‌అదాలత్ చక్కటి వేదికగా చెప్పవచ్చు. కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదుర్చుకోవడమే గాక, ఇరువర్గాలకు న్యాయం జరిగేలా న్యాయస్థానాలు పరిష్కార మార్గాలు చూపుతాయి. ఇక్కడ కుదిరిన రాజీ కేసులను అప్పీల్ చేసుకోవడానికి వీలు లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం 4వ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. లోక్‌అదాలత్‌లో మోటార్ వెహికిల్ యాక్టు, ఆబ్కారీ, రుణాలు, కుటుంబ తగాదాలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత జూన్‌లో నిర్వహించిన 3వ జాతీయ లోక్‌అదాలత్‌లో 17,495 కేసులను పరిష్కరించగా.. రూ. 58,37,519 జరిమానా వసూలైంది. కాగా, లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారంతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోక్‌అదాలత్‌కు వచ్చే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు.
జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. చిన్నచిన్న కేసుల్లో రాజీ కుదుర్చుకోవడానికి లోక్‌అదాలత్ ఉపయోగంగా ఉంటుంది. కక్షిదారులు, నిందితులుగా ఉన్నవారు వారి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో సంప్రదిస్తే.. వారికి అక్కడి పోలీసులు సహాయం అందిస్తారు.
– వెంకట్‌రెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి