
పత్రికల గొంతు నొక్కడం
● సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు
● మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, రాజకీయ నాయకులు
తీవ్రంగా ఖండిస్తున్నాం..
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు న మోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. – వి.నరేందర్‌చారి,
ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
అప్రజాస్వామ్యం
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కేలా వ్యవహరించడం శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు’ అని జర్నలిస్టు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం.. జర్నలిస్టులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడం ఏమాత్రం హర్షణీయం కాదన్నారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలో కేసులు పెట్టడం దిగజారుడుతనమని.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలు సమర్థనీయం కాదంటూ.. ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులకు సంఘీభావం ప్రకటించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ప్రతిపక్ష పాత్ర పోషించాలి..
జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య. పోలీసులు కూడా కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడం తగదు. ఎన్నికల సమయంలో రాజకీయ పా ర్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరపున ప్రశ్నించడం సహజం. ఎడిటర్ స్థాయి వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఏకంగా జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరించడం దారుణం. – చంద్రశేఖర్‌రావు,
జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్‌కర్నూల్
జర్నలిజంపై దాడి సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.
– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
కలానికి సంకెళ్లు అప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల

పత్రికల గొంతు నొక్కడం

పత్రికల గొంతు నొక్కడం

పత్రికల గొంతు నొక్కడం

పత్రికల గొంతు నొక్కడం