
తాడూరు మండలం మేడిపూర వద్ద చెక్ డ్యాం మీదుగా పరవళ్లు తొక్కుతున్న దుందుభీ వాగు
జిల్లావ్యాప్తంగా భారీగా పెరిగిన భూగర్భజలాలు
గతేడాది కన్నా 5 మీటర్లపైకి వచ్చిన గంగమ్మ
జిల్లాలో సగటున 3.45 మీటర్ల లోతులోనే నీటిమట్టం
పెంట్లవెల్లి, కోడేరు, కొల్లాపూర్, తాడూరు మండలాల్లో రెట్టింపు స్థాయి
ఈ ఏడాది సాధారణం కన్నా 85.4 శాతం అధికంగా వర్షపాతం నమోదు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలోనే సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈసారి భూగర్భజలాలు ఏకంగా 5 మీటర్ల పైకి ఉబికివచ్చాయి. సాధారణంగా జిల్లాలో 10 మీటర్ల లోతులో ఉండే భూగర్భజలాలు ఈ ఏడాదిలో ఆగస్టు నెల నాటికి ఎన్నడూ లేనంతగా పైకి చేరాయి. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సగటున 3.45 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణానికి మించిన వర్షపాతంతో భూగర్భ జలాలు ఉబికివచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు జలకళ సంతరించుకుంది.
ఈ సీజన్‌లో అధిక వర్షపాతం..
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సాధారణ వర్షపాతానికి మించి 85.4 శాతం అధిక వర్షం కురిసింది. ఇంకా సెప్టెంబర్ నెలలోనూ నమోదయ్యే వర్షపాతంతో సగటు వర్షపాతం మరింత పెరగనుంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 339.4 మి.మీ., కాగా, ఈ ఏడాది ఇప్పటికే 629.3 మి.మీ., వర్షపాతం నమోదైంది. వానాకాలం సీజన్‌లో ఆగస్టు నెల నాటికే సాధారణ వర్షపాతం కన్నా 85 శాతం అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 420.4 మి.మీ., తక్కువగా వంగూరు మండలంలో 269.8 మి.మీ వర్షం కురిసింది.
కోడేరు శివారులో నిండిన చెరువు
సాధారణ వర్షపాతం 339.4మి.మీ.,
కురిసింది 629.3 మి.మీ.,
అధిక వర్షపాతం 85.4 శాతం