
అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన
అచ్చంపేట: అడవులను రక్షించడం అందరి బాధ్యత అని, అటవీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా 33 శాతం అడవులు పెంచేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీశాఖ ఆధ్వర్యంలో అచ్చంపేట ఫారెస్ట్ డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. మానవాళి మనుగడ సాఫీగా సాగాలంటే అడవుల శాతం పెరగాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి వీర మరణం పొందిన 34 మంది అటవీ అమరవీరుల సేవలను మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి, మాజీ ఎంపీపీ రామనాథం, మార్కెట్ చైర్మన్ రజిత, ఫారెస్ట్ డివిజనల్ అధికారులు చంద్రశేఖర్, రామ్మూర్తి, రేంజ్ అధికారులు ఈశ్వర్, దేవరాజ్, మక్దూం, వీరేష్, గురుప్రసాద్, సుబ్బుర్, జూనియర్ అటవీ అధికారుల సంఘం సభ్యులు ముజీబ్ ఘోరి, రాంబాబు, హన్మంతు, తేజశ్రీ, వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.