
ఇంటర్ ఫలితాలు మెరుగుపర్చాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు అధికారులు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ వెల్ఫేర్, ఇంటర్ కేజీబీవీలు, ఇతర సంక్షేమ శాఖలు, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 83 ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిధిలో మొదటి సంవత్సరంలో వందశాతం ఎన్‌రోల్ చేయాలని ఆదేశించారు. జూనియర్ కళాశాలలో సివిల్ వర్క్, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పన, చిన్నపాటి మరమ్మతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వెంటనే ఆయా పనులు పూర్తిచేయాలన్నారు. విద్యలో నాణ్యత పెరగాలని, లెక్చరర్స్ సమయపాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌పై వ్యక్తిగతంగా దృష్టి పెట్టి, ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని, అందుకు తగ్గట్టుగా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సిద్ధం కావాలని తేల్చిచెప్పారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్‌కుమార్ తదితరులుపాల్గొన్నారు.
వందశాతం లక్ష్యం సాధించాలి
బ్యాంకు అధికారులు రుణ పంపిణీ లక్ష్యాలను వందశాతం సాధించాలనే పట్టుదలతో పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారులకు అనేక సంక్షేమ పథకాల కింద రుణాలను మంజూరు చేస్తున్నాయని, ఆ రుణాలు నిజమైన అర్హులకు చేరేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎం సూర్యఘర్, స్టాండ్ ఆఫ్ ఇండియా, పీఎంఈజీపీ, ముద్రా లోన్లు నిర్దేశించిన మేరకు చేపట్టాలన్నారు. ఇందిరా మహిళా శక్తి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.