
ఎర్రజెండా వారసత్వాన్ని ప్రజలకు అందించాలి
వనపర్తి రూరల్: తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు, పోరాటాల వారసత్వాన్ని ప్రజలకు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ రాజు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటానికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. దుష్ప్రచారం చేస్తూ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. ఆ రోజుల్లో జాగీర్దారులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన ఎంతోమంది పోరాటంలో పాల్గొని విజయం సాధించారని గుర్తుచేశారు. డబ్బులు ఇవ్వకుండా అన్ని కులాల వృత్తిదారులతో ఊడిగం చేయించుకోవడాన్ని నాటి కమ్యూనిస్టు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, నర్సింహారెడ్డి తదితరులు ఎందరో ఈ పోరాటాలకు నాయకత్వం వహించారని.. వారి త్యాగ ఫలితాన్ని కమ్యూనిస్టులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని.. గవర్నర్ బిల్లును ఆమోదించాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, ముఖ్య నాయకులు మండ్ల రాజు, మేకల ఆంజనేయులు, బొబ్బిలి నిక్సన్, సాయిలీల, ఆది, ఆర్‌ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ