
సీఈఓలకు స్థాన చలనం
నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి..
● ఉమ్మడి పాలమూరు జిల్లాలో
78 మంది బదిలీ
● రెండు విడతల్లో బదిలీ ఉత్తర్వులు
జారీ చేసిన డీసీసీబీ అధికారులు
● జీఓనంబర్ 44 సర్వీస్ రూల్స్
వర్తింపుతో సాధ్యమైనట్లు చర్చ
వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేసేందుకు విడుదల చేసిన జీఓనంబర్ 44 ఆధారంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు వారం వ్యవధిలో రెండు విడతల్లో స్థాన చలనం కల్పించారు. నాలుగు దశాబ్దాల కాలంలో పీఏసీఎస్‌లలో పనిచేసే సీఈఓలు, ఇతరల ఉద్యోగులను బదిలీ చేసిన దాఖలాలు లేవు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఇతర పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందుతున్న పీఏసీఎస్‌ల దశ మారుతున్న దృష్ట్యా పూర్తిగా సంఘం పరిధిలో పనిచేసే ఉద్యోగులే అయినా.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని జీఓ విడుదల చేసిన విషయం విధితమే. ఈ జీఓ ఆధారంగా సిబ్బందికి బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ డీసీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 45 మంది సీఈఓలను, తాజాగా బుధవారం మరో 33 మందిని బదిలీ చేస్తూ డీసీసీబీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల ప్రక్రియను సీఈఓల్లో 80 శాతం సానుకూలంగా తీసుకోగా.. 20 శాతం వ్యతిరేకిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకేచోట పని చేయడంతో పాలనలో కొంత నిర్లక్ష్యం.. మూస పద్ధతి పాటిస్తున్నారన్న ఆరోపణలకు ఈ బదిలీలతో చెక్ పడుతోందని అధికారులు, డీసీసీబీ పాలకవర్గం భావిస్తోంది. కొందరు పని చేయడానికి బద్ధకిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.