
ఉపాధ్యాయ వృత్తి మహత్తరమైనది
అచ్చంపేట: తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అని మన సంస్కృతి చెబుతుందని, అలాంటి ఉపాధ్యాయ వృత్తి మహత్తరమైనదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సత్యం, అసత్యం మధ్య తేడాను అర్థం చేయించి, చీకటి నుంచి వెలుగులోకి పయనించేలా తీర్చిదిద్దేది గురువులే అన్నారు. అలాగే, ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి ఒక గొప్ప సామాజిక బాధ్యత అని గుర్తు చేస్తూ, బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు అవసరమైన వనరులు అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వస్తువులు కల్పించిందని, విద్యార్థులకు రుచికరమైన భోజనంతోపాటు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పాఠశాలల ప్రారంభం రోజే అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ రజిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు.
● ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 151 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్, ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారి జ్యోతితో కలిసి శాలువాలతో సత్కరించారు.
కలెక్టర్ బదావత్ సంతోష్