
భక్తిశ్రద్ధలతో మిలాన్ ఉన్ నబీ
కందనూలు: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలో ముస్లింలు మిలాన్ ఉన్ నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం జామా మసీదు కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్ ఆధ్వర్యంలో మౌలానా ఉస్మాన్ రజా యజ్దాని ఆధ్యాత్మిక బోధన చేశారు. భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఈ భూగోళం మీద ప్రవక్త జన్మదినం జరుపుకొంటామన్నారు. ప్రవక్త మహమ్మద్ భూమి పైకి వచ్చిన తర్వాతే ఇస్లాం మతం గొప్పదనం ఏమిటో సమాజానికి తెలిసిందన్నారు. సర్వ మానవాళికి ఒక గొప్ప జీవితాన్ని అందించిన మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళికి దేవుడు పంపిన మార్గదర్శకుడని కొనియాడారు. దీంతోపాటు ప్రవక్త గొప్పదనాలను ఇస్లాం ధర్మానికి ప్రవక్త చూపిన సన్మార్గాలను వివరించారు.