
మత్స్యశాఖలో గందరగోళం
గతంలో అక్రమాలు జరిగాయి
●
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లా మత్స్య సహకార సంఘం పాలకవర్గం, అధికారులకు మధ్య వివాదం రచ్చకెక్కుతోంది. జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో గతేడాది చేపల పంపిణీకి సంబంధించిన బుక్ ఆఫ్ రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు అందుబాటులో లేవని, తమకు అందించాలంటూ జిల్లా మత్స్యశాఖ అధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చైర్మన్ వర్సెస్ ఆఫీసర్..
జిల్లాలో గతేడాది మత్స్యశాఖ ద్వారా చేపట్టిన చేపపిల్లల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు మత్స్య సహకార సంఘాల నాయకులతో పాటు అధికార వర్గాల నుంచి పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల చెరువుల్లో రికార్డుల్లో కన్నా తక్కువ సంఖ్యలో చేపపిల్లలను వదిలారని, చెరువుల లీజు పునరుద్ధరణ, కొత్త సభ్యత్వాలు, మత్స్యకారుల ఇన్యూరెన్స్ క్లెయిమ్ విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని మత్స్య సహకార సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం, చెరువులు లేకున్నా ఉన్నట్టు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల చంద్రసాగర్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మత్స్య సహకార సంఘం చైర్మన్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు దిగారు. మత్స్యశాఖ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు సహకార సంఘం నాయకుల వద్ద ఉండటంపైనా పంచాయతీ పోలీస్‌స్టేషన్ వరకు చేరింది.
జిల్లాలో పలుచోట్ల చెరువులు లేకున్నా బోగస్ పేర్లతో చెరువులు సృష్టించి చేపలను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో వీరమ్మ చెరువు, వీరమాని చెరువు, వెంకటేశ్వర చెరువు, వెంకటేశ్వర ట్యాంకు తదితర పేర్లతో చెరువులు ఉన్నట్లుగా సృష్టించి కొంతమంది మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు ఆయా చెరువుల్లో చేపల పంపిణీ చేసినట్లుగా మాయ చేస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లల పంపిణీ విషయంలో అక్రమాలకు బాధ్యులెవరు అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.
సహకార సంఘం నాయకులు, అధికారుల మధ్య పంచాయితీ
పరస్పర అవినీతి ఆరోపణలు,
విమర్శలతో రచ్చ
చెరువుల లీజు, చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
రికార్డుల మిస్సింగ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు
రికార్డులు మత్స్యశాఖ కార్యాలయంలో ఉండాలి. ఇప్పటి వరకు మాకు అప్పగించలేదు. మా వద్ద ఒక్క రికార్డు కూడా లేదు. ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాం. గతంలో క్షేత్రస్థాయిలో లేని చెరువులు ఉన్నట్లుగా పేర్కొని అక్రమాలకు పాల్పడ్డారు. వాటిపై విచారణ కొనసాగుతోంది.
– రజని, జిల్లా మత్స్య శాఖ అధికారిణి