
తీరని.. యూరియా కొరత
ఉప్పునుంతల/కల్వకుర్తి రూరల్/తెలకపల్లి/అచ్చంపేట రూరల్: స్థానిక పీఏసీఎస్ వద్ద బుధవారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలివచ్చి క్యూలో నిలబడ్డారు. ఈ క్రమంలో మండలంలోని జప్తీ సదగోడుకు చెందిన మొగిలి అనిత అనే మహిళా రైతు క్యూలో నిల్చొని స్పృహతప్పి పడిపోవడంతో తోటి రైతులు ఆందోళనకు గురయ్యారు. కొంతసేపటికి ఆమె తేరుకొని మేల్కొనడంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. ఆలస్యంగా వెళ్తే యూరియా బస్తాలు దొరకవనే ఆలోచనతో ఏమీ తినకుండ వచ్చి క్యూలో గంటల తరబడి నిల్చుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలే ఇస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్యభర్తలు ఇద్దరు వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. అందుబాటులో ఉన్న 600ల బస్తాలను ఒక్కో రైతుకు రెండేసి బస్తాల చొప్పున అందించినట్లు ఏఓ రమేష్ తెలిపారు. ఇప్పటివరకు మండలంలో ఈ వానాకాలం సీజన్‌లో 11,312 బస్తాల యూరియాను పంపిణీ చేశామన్నారు. గతేడాదిని పోల్చుకుంటే ఇప్పవరకే 3,601 బస్తాలు అదనంగా అందించామని పేర్కొన్నారు.
● కల్వకుర్తి పీఏఎస్ కార్యాలయానికి బుధవారం యూరియా లోడ్ వస్తుందనే సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ శాఖ అధికారి సురేష్, పీఏసీఎస్ సిబ్బంది రైతుల నుండి ఆధార్, పాసు పుస్తకాల జిరాక్స్‌లు సేకరించి పేర్లు నమోదు చేసుకొని టోకెన్లు అందించారు. 280 బస్తాల యూరియా అందుబాటులో ఉండడంతో ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు సీఈఓ వెంకట్‌రెడ్డి తెలిపారు.
● తెలకపల్లి మండలంలోని సింగిల్ విండో కార్యాలయం వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. కానీ యూరియా స్టాక్ లేకపోవడంతో చేసేదేం లేక చాలా మంది రైతులు వెనుతిరిగారు.
● అచ్చంపేట పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతు లు బారులు తీరారు. వారం రోజులుగా యూరి యా కోసం తిరుగుతున్నా.. ఒక బస్తా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీరని.. యూరియా కొరత

తీరని.. యూరియా కొరత