
భూ కబ్జాలు, జీఎస్టీ ఎగ్గొట్టిన చరిత్ర ‘మర్రి’ది
● హైదరాబాద్ చుట్టూ నీ భూ బాగోతం అంతా తెలుసు
● ఒకసారి బీఆర్‌ఎస్ గాలికి, రెండోసారి నా పుణ్యాన గెలిచినవ్: కూచుకుళ్ల
నాగర్‌కర్నూల్: హైదరాబాద్ చుట్టూ మర్రి జనార్దన్‌రెడ్డి చేసిన భూ బాగోతాలు మొత్తం తెలుసని, రూ.500 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం బలవంతంగా వసూలు చేసిన చరిత్ర మర్రి ది అని ఎమ్మెల్యే కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేసి వాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత కొడుకు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆరు నెలలు సతాయించిన ఘనత నీదన్నారు. పదేళ్లు నియోజకవర్గాన్ని కబ్జాల పేరుతో బ్రష్టు పట్టంచారని దుయ్యబట్టారు. 2014లో బీఆర్‌ఎస్ గాలికి, 2018లో నా పుణ్యాన గెలిచావని అన్నారు. రూ.కోటి తీసుకుని మహిళా శక్తి భవనాన్ని ఊరికి దూరంగా కట్టించిండని ధ్వజమెత్తారు. ఆర్టీఓ కార్యాలయాన్ని 14 కిలో మీటర్ల దూరంలో రియల్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కొల్లాపూర్ చౌరస్తాలో, తెలకపల్లిలో భూమి కబ్జా చేసిన మాట వాస్తవ కాదా అని ప్రశ్నించారు. హైదరబాద్‌లోని కొండకల్ భూమలుపై నా లెటర్ ప్యాడ్‌తోనే ఫిర్యాదు చేశావన్నారు. జక్కా రఘునందన్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని అవినీతి పాల్పడి, అవసరం తీరాక ఆయనను తరిమేశాడని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ నాయకులు హబీబ్, కోటయ్య, సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కావలి శ్రీను, సునేంద్ర, జక్కా రాజ్‌కుమార్, నిజాం పాల్గొన్నారు.