
ఓటర్ తుది జాబితా విడుదల
నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆయా జాబితాలను పంచాయతీ బోర్డులపై అతికించి, వాటిపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 31న వాటిని పరిశీలించి మంగళవారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 460 గ్రామ పంచాయతీలు, 4,102 వార్డులు, 4,102 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 6,47,342 ఓటర్లు ఉన్నారని, అందులో 3,23,016 మంది పురుషులు, 3,24315 మంది మహిళా ఓటర్లు, 11 మంది ఇతరులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా వివరాలు పొందుపరిచారన్నారు.
నేడు ఉత్తమ
ఉపాధ్యాయులకు సన్మానం
కందనూలు: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టణ శివారులోని గగ్గలపల్లి తేజ కన్వెన్షన్‌హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ స్థాయిల ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీల పాఠశాలల నుంచి 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆమోదంతో ఎంపిక చేసినట్లు సూచించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
భక్తిశ్రద్ధలతో పండుగలు నిర్వహించాలి
కందనూలు: వినాయక మండపాల నిర్వాహకులు విగ్రహాల ఎత్తులను చూడకుండా భక్తులు ఆకర్షించేలా సంప్రదాయాలకు అనుగుణంగా అలకరించి భక్తిశ్రద్ధలతో పండుగల నిర్వహించాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హకీం వీధిలో త్రిదళన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమానికి నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆకాంక్షించారు. డీజేల ఏర్పాటు వల్ల అనేక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ప్రవీణ్, నిఖిల్, చందు, ఈశ్వర్, చంద్రకాంత్, నితిల్ సాయి, భరత్ నంబి, మణికంఠ, బాలు తదితరులు పాల్గొన్నారు.