
రుణాల చెల్లింపులు సులభతరం
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై అవగాహన
దళారీ వ్యవస్థ లేకుండా..
● ఇకపై నెలవారీ డబ్బులు
సెల్‌ఫోన్‌లోనే బ్యాంకులకు చెల్లింపు
● మధ్య దళారుల ప్రమేయం
లేకుండా చేసేందుకు ప్రయత్నం
● అక్రమాలకు చెక్..
పారదర్శకతకు పెద్దపీట
అచ్చంపేట రూరల్: పట్టణ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాల సభ్యులు రుణాల చెల్లింపునకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకొని మధ్యవర్తులు మహిళల నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకులో జమ చేయకుండా కాజేస్తున్నారు. ఇటీవల వీటిపై మెప్మా అధికారులకు ఫిర్యాదులు రావడంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. నేరుగా సభ్యులు బ్యాంకులో జమ చేసేలా అవగాహన కల్పిస్తున్నారు.
జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలక సంఘాల్లో మెప్మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా గ్రూపుగా, వ్యక్తిగతంగా బ్యాంకు రుణాలు అందిస్తున్నారు. గ్రూపులో పది మంది సభ్యులు ఉండగా.. వచ్చిన రుణాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. చెల్లింపుల సమయంలో అందరూ కలిపి కడతారు. కొన్ని సంఘాల్లో సభ్యుల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకొని బ్యాంకులో జమ చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని ఓ గ్రూపులో ఇలాంటి సమస్య ఎదురైంది. ఇకపై అలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానం అమలులోకి తీసుకొచ్చారు. బ్యాంకులో నేరుగా జమ చేయడం, గూగుల్ పే, ఫోన్ పే చేసి రసీదును గ్రూపు సభ్యులకు చూపించాలి. ఆ సభ్యురాలు చెల్లింపు చేసుకున్నట్లు నమోదు చేసుకుంటారు.
జిల్లా పరిధిలో ఇలా..
ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నాం. దళారీ వ్యవస్థ లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాం. మహిళా సంఘ సభ్యురాళ్లు బ్యాంకులో డబ్బులు జమ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాం. సభ్యులు నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం వల్ల అక్రమాలు జరగవు.
– శ్వేత, మెప్మా ఏడీఎంసీ

రుణాల చెల్లింపులు సులభతరం