
ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలని, సంస్థలోకి యూనియన్లు అనుమతించాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రవీందర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రీజియన్ ఆర్టీసీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికులు పని భారంతో సతమతమవుతున్నారన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడం వల్ల వాటి నిర్వహణలో అనేక లోపాలు వస్తాయని వాటిని వెంటనే ఆర్టీసీకి అప్పగించాలని, దీని వలన లాభాలు వస్తాయని చెప్పారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకళాపాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, వెంకటయ్య, ప్రేమలత, సుమలత, వెంకటేష్, చింతలయ్య, అయూబ్, అర్జున్, అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
అజిలాపూర్ పాఠశాలకు ఉపాధ్యాయుల నియామకం
వెల్దండ: మండలంలోని అజిలాపూర్ పాఠశాలకు జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్దండ ఇన్‌చార్జ్ ఎంఈఓ చంద్రుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శనివారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇక్కడ 8 తరగతులకు గాను 5 మంది మాత్రమే ఉపాధ్యాయుల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గణితం, ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థుల ఇబ్బందులు తీర్చేందుకు డీఈఓ స్పందించినట్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం ఉర్దూ మీడియం హైస్కూల్ నుంచి భాస్కర్‌రావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా, వెల్దండలోని జిల్లా పరిషత్ పాఠశాల నుంచి అశోక్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, అదేవిధంగా సాజిదా స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టులు బోధించేందుకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. సోమవారం వారు విధులకు హాజరై విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తారని ఎంఈఓ చంద్రుడు తెలిపారు.
ప్రభుత్వ వైఖరిని ఖండించాలి
శాంతినగర్: బాధిత ప్రజలను కలిసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, బాధిత ప్రజలను కలవడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ పీపుల్స్ జాక్ రాష్ట్ర కోకన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య అన్నారు. రాజోళి మండలంలోని పెద్దధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ బాధితులను కలవడానికి వారు వెళ్తుండగా శాంతినగర్ పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. అనంతరం శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇథనాల్ కంపెనీ వల్ల వాయు, జల, భూగర్భ కాలుష్యం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఇథనాల్ కంపెనీని వ్యతిరేకించకుండా యజమానులకు వత్తాసు పలుకుతూ, కంపెనీ నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఖండించాలన్నారు. హైదరాబాద్ నుంచి మేధావులు వచ్చారని తెలుసుకున్న పెద్దధన్వాడ, మాన్‌దొడ్డి ప్రజలు, రైతులు కలుకుంట్ల వద్ద వెళ్తున్న వారిని కలుసుకుని తమ గోడు వెలిబుచ్చారు. ఆయా గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారితో వివరించారు.

ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి